షాంఘైలో భారత మహిళ నిర్బంధం
అరుణాచల్ ప్రదేశ్ తనదేనని మరోసారి తేల్చి చెప్పిన చైనా
అక్షర కిరణం, (అరుణాచల్ ప్రదేశ్/జాతీయం): భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్‌పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పేర్కొంది. మరోవైపు.. ఆ మహిళను తామేమీ బంధించలేదని, వేధింపులు చేయలేదని తెలిపింది. అయితే భారత్ మాత్రం చైనా చేస్తున్న వాదనను గట్టిగా తిప్పికొట్టింది.
బ్రిటన్‌లో నివసించే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పెమా వాంగ్ జోమ్ థోంగ్డోక్ అనే మహిళ.. ఈనెల 21వ తేదీన లండన్ నుంచి జపాన్‌కు వెళ్లే క్రమంలో షాంఘై ఎయిర్‌పోర్టులో ఆగారు. అయితే.. ఆమె భారత పాస్‌పోర్ట్‌పై పుట్టిన ప్రదేశం అరుణాచల్‌ప్రదేశ్ అని ఉండటంతో.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం కాబట్టి.. ఆమెకు ఉన్న భారత పాస్‌పోర్ట్ చెల్లదంటూ చైనా అధికారులు తనను ఆపేశారని ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా తన పౌరసత్వాన్ని వారు హేళన చేశారని.. 18 గంటల పాటు తనను నిర్బంధించి, కనీస సదుపాయా లు కూడా కల్పించలేదని థోంగ్డోక్ సంచలన ఆరోపణలు చేశారు. చివరికి షాంఘైలోని భారత కాన్సులేట్ జోక్యంతో ఆమెను విడిచిపెట్టారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్.. మంగళవారం స్పందిస్చూ.. ఆ మహిళ చేసిన ఆరోపణలను కొట్టేశారు. జంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా పెట్టిన పేరు) అనేది చైనా భూభాగమని.. భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ గుర్తించలేదంటూ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సరికొత్త ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి.
అయితే.. పెమా వాంగ్జోమ్ థోంగ్‌డోక్‌ను షాంఘై విమానాశ్రయంలో నిర్బంధించలేదని.. ఎలాంటి వేధింపులు చేయలేదని.. తమ అధికారులు చట్టాలు, రూల్స్ ప్రకారమే వ్యవహరించినట్లు మావో నింగ్ వివరణ ఇచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢల్లీి, బీజింగ్‌లలోని చైనా అధికారులకు బలమైన దౌత్యపరమైన నిరసనను తెలియజేసింది. భారత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ విడదీయరాని భూభాగమని.. అక్కడి పౌరులు భారత పాస్‌పోర్ట్‌తో ప్రయాణించే పూర్తి హక్కు ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.