అంగన్వాడీ కేంద్రాల పాల ధర పెంపు
îలీటర్‌పై రూ.9 పెంచిన ప్రభుత్వం
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలకు సరఫరా చేసే పాల ధరల్ని పెంచేందుకు సీఎం చంద్రబాబు ఆమోదించారు. లీటర్ పాలపై రూ.9 పెంచేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)కు అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా చేసినందుకు లీటర్‌కు రూ.54.60 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ధర సరిపోవడంల లేదని.. పెంచాలని ఆ సంస్థ కోరింది. ధర పెంపుపై నాలుగు నెలలుగా ఏపీడీడీసీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థ)కు, కేఎంఎఫ్‌కు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
గత నెలలో ఏపీ ప్రభుత్వం లీటర్‌పై రూ.5 పెంచేందుకు అనుమతించగా.. కేఎంఎఫ్ ఒప్పుకోలేదు. తాజాగా మరోసారి చర్చించి.. లీటర్‌కు రూ.9 పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖలో ఈ ఫైల్ ఉంది.. రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని 55,547 అంగన్వాడీ కేంద్రాల్లో 23.50 లక్షల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు అందజేస్తున్నారు. ఏపీడీడీసీఎఫ్.. కేఎంఎఫ్ నుంచి 200 మి.లీ., 500 మి.లీ., లీటర్ టెట్రా ప్యాకెట్లలో పాలను సేకరించి అందిస్తోంది.
అంగన్వాడీలకు అందించే పాలకు సంబంధించి నెలకు మొత్తం దాదాపు రూ.38 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. తాజాగా రూ.9 పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ఏడాదికి దాదాపు రూ.75 కోట్ల వరకు అదనంగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరాకు ఏడాదికి రూ.456 కోట్లు ఖర్చు అవుతున్నాయి.. తాజాగా ధర పెంచడంతో మొత్తం వ్యయం రూ.531 కోట్లు కానుంది.
నవజాత శిశు వారోత్సవాలు ప్రారంభం
మరోవైపు నవజాత శిశు వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచఎం) ఆధ్వర్యంలో ఆరోగ్య పరిరక్షణ, నిరంతర వైద్యసేవలు, సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుదల లక్ష్యంగా ఈ నెల 21 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరిపిస్తారు. శిశువుల ఆరోగ్య వివరాలను శైశవ్ యాప్‌లో నమోదు చేసి వారి ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తారు.