సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను
ప్రతి నటుడు ఒక్కోస్థాయిలో నిష్ణాతుడు ముందు బాధ్యత ఆ తరువాతే వినోదం
కంకిపాడులో పల్లెపండుగ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అక్షర కిరణం, (కంకిపాడు/విజయవాడ): సినిమా ల్లో ఎవరితోను పోటీ పడనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా... అభిమానులు ‘ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో, పవన్ సినిమాల గురించి కాసేపు మాట్లాడారు. ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదమని ఆయన అన్నారు.
ముందు యువతకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని... ఆ తర్వాతే విందులు, వినోదాలు అని వ్యాఖ్యానించారు. సినిమాలలో తాను ఎవరితోను పోటీ పడనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకునే వాడినని పవన్ కళ్యాణ్ చెప్పారు.