భారత్కు జాక్పాట్
అండమాన్ దీవుల్లో భారీగా ఆయిల్ నిక్షేపాలు
దాదాపు 2 లక్షల కోట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా
అక్షర కిరణం, (బంగాళాఖాతం/జాతీయం): బంగాళాఖాతంలో భాగమైన అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడిరచారు. దక్షిణ అమెరికాలోని గయానాలో కనుగొన్నంత పెద్ద మొత్తంలోనే ఇక్కడ కూడా నిక్షేపాలు ఉండొచ్చని ఆయన అన్నారు. దీంతో అండమాన్ నికోబార్ దీవులు కూడా చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో చేరతాయి. అయితే, ఇక్కడ చమురు వెలికి తీయడం ఖర్చుతో కూడుకున్న పని అని మంత్రి తెలిపారు.
అండమాన్ సముద్రంలో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఇది సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ హెస్ కార్పొరేషన్, చైనాకు చెందిన సీఎన్ఓఓసీ కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది.
అండమాన్ సముద్రంలో చమురు వెలికి తీయడం కష్టమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒక్కో బావి తవ్వడానికి దాదాపు 10 కోట్ల డాలర్లు (సుమారు రూ.850 కోట్లు) ఖర్చవుతుందని ఆయన తెలిపారు. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చింది. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఒక్కో బావికి 10 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం రూ.37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ భాగం అండమాన్, నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు.
కాగా, ఇరాన్, ఇజ్రాయేల్ ఘర్షణలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. అయితే, దేశంలో ముడి చమురుకు కొరత లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేస్తే మాత్రం చమురు సరఫరాకు ఇబ్బంది కలగొచ్చు. ఒకవేళ అది జరగకపోతే, చమురు ధర 75 డాలర్ల కంటే పెరగకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై వాణిజ్య వర్గాల్లో ఆందోళన నెలకుంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ వారం సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి నౌకాయాన, కంటైనర్ కంపెనీలు, ఎగుమతిదారులు, వాణిజ్యంతో సంబంధం ఉన్న ఇతర సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ భర్త్వాల్ తెలిపారు. తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం భారత-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది జులై 9 లోగానే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.