రూ.679.71 కోట్లతో హైవే విస్తరణ: తిరుపతి, చెన్నైకి వేగంగా ప్రయాణం
అక్షర కిరణం, (అమరావతి/ఢిల్లీ): ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి-42 (ఎన్హెచ్-42) విస్తరణ.. బలోపేతానికి రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ ముదిగుబ్బ-కదిరి జాతీయ రహదారిని పేవ్డ్ షోల్డర్లతో కూడిన 4 లేన్ల నేషనల్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ రహదారి ద్వారా బెంగళూరు-విజయవాడ-కోల్కతా ఎక్స్ప్రెస్వేతోపాటు.. తిరుపతి, చెన్నై నగరాలకు వేగవంతమైన అనుసంధానం లభించనుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సరుకు రవాణా మరింత వేగంగా సాగి రవాణా వ్యయాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే రహదారిపై ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రాంతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగానికి ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రాజెక్టులో 4 లేన్ల ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, ఒక ఫ్లైఓవర్, ఒక వెహికల్ అండర్పాస్ కమ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఒక ప్రధాన వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఆధునిక ప్రమాణాలతో రహదారిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి రావడంతో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు లభించడంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది. భవిష్యత్తులో పెట్టుబడులు ఆకర్షించడంలోనూ ఈ జాతీయ రహదారి కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.