సరిహద్దులో ఏపీ పంచాయతీ ఎన్నికల సెగ !
îరోజురోజుకూ ముదురుతున్న కొటియా వివాదం.. îబీజేడీ బృందం పర్యటన
అక్షర కిరణం, (పార్వతీపురం): ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియలో మినీ సమరాలే జరుగుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు సరిహద్దుకు కూడా పాకింది. ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొటియాలో ఏపీ ప్రభుత్వం స్థానిక పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏళ్ల నాటి వివాదం మళ్లీ రాజుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు కొటియా గ్రామాలను మూడు ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి పోలింగ్, ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ని రిలీజ్ చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడ ఒడిశా ప్రభుత్వం రంగంలోకి దిగింది.
అడ్డుకుంటామంటున్న ఒడిశా ప్రభుత్వం..
కొటియా ప్రాంతంలో ఏపీ పంచాయతీ ఎన్నికలను అడ్డు కుంటామని ఒడిశా గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఆ ప్రాంతం తమ రాష్ట్రంలో అంతర్భాగమని నొక్కిచెప్పింది. ఆ ప్రాంతంలో ఏపీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవా లని, అప్రమత్తంగా ఉండాలని కోరాపుట్ జిల్లా యంత్రాంగా నికి ఆదేశాలు జారీ చేశామని ఒడిశా రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. కొటియాలో ఎన్నికలను నిర్వహ ణను ఆపేందుకు ఒడిశా ప్రభుత్వం చట్టపరమైన ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదని మంత్రి సురేష్ పూజారి తెలిపారు. దీనిపై ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి నేతృత్వంలో అడ్వకేట్ జనరల్, దక్షిణ రెవెన్యూ కమిషనర్, కొరాపుట్ కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించారు.
బీజూ జనతా దళ్ బృందం పర్యటన...
మరోవైపు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న వివాదా స్పద కొటియా పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల కార్యకలాపా లను సమీక్షించేందుకు, నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష బీజూ జనతా దళ్ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం అక్కడ కు వెళ్లనుంది. ఈ టీమ్‌లో మాజీ ఎంపీలు ఝినా హికాకా, ప్రదీప్ మాఝీ, మనోహర్ రంధారి, పార్టీ గిరిజన సెల్ ఉపా ధ్యక్షుడైన ఎమ్మెల్యే జగన్నాథ్ సారక తదితరులు ఉన్నారు. కొటియా వాసులను కలిసి, వారి కష్టాలను, ఆందోళనలను అర్థం చేసుకోవాలని బీజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఈ బృందానికి సూచించారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని నవీన్ పట్నాయక్ అంతకుముందే ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీకి లెటర్ కూడా రాశా రు. అందులో బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొటియా వివాదాన్ని పరిష్క రించి, ఒడిశా ప్రాదేశిక సమగ్రతను, ఆత్మగౌరవాన్ని కాపా డుతామని బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
‘కొటియా’ ఒక తేలని పంచాయితీ..
కొటియా వివాదం ఇప్పుడు మొదలైంది కాదు.. కొన్నేళ్లుగా ఏపీ, ఒడిశాల మధ్య తేలని పంచాయితీ. కొటియా గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 28 గ్రామాలున్నాయి. ఇందులో 21 గ్రామాలు కోరాపుట్ జిల్లాకు చెందుతాయని ఒడిశా అంటుంటే, కాదు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందుతా యని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. 1936లో ఒడిశా రాష్ట్రం, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సరిహద్దుల గుర్తింపులో జరిగిన కొన్ని లోపాల వల్లే ఈ సమస్య మొదలైంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్తే.. 1968లో ఈ గ్రామాల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తీర్పు చెప్పింది. కానీ ఈ 21 గ్రామాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం మాత్రం సమసిపోలేదు.