తాను మరణిస్తూ మరో ఐదుగురికి జీవితం
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుం సభ్యులు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): తాను మరణిస్తూ మరో ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు కాపాడారు ఒడిశా చెందిన వ్యక్తి. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9వ తేదీన ఒడిసా రాష్ట్రం పర్లకిమిడి జిల్లాకు చెందిన నరేష్ పట్నాయక్(32) ఇంట్లో స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావం అవుతోందని వైద్యులు తెలియజేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఒడిసా నుంచి విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అతన్ని రక్షించడానికి రెండు రోజులపాటు వైద్యులు ఎంతో శ్రమించారు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బృందం శుక్రవారం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత అవయవదానంపై వైద్య బృందం అతని భార్య, కుమారుడు, కుమార్తె, బంధువులకు అవగాహన కల్పించారు. అవయవ దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు.. ఆయన నరేష్ పట్నాయక్ శరీరంలో పనిచేస్తున్న ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్ అవయవాలను సేకరించేందుకు అనుమతి జారీ చేశారు. సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు.. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను ఈసందర్భంగా ఆయన అభినందించారు... అలాగే విజయవంతంగా అవయవాలను సేకరించి తరలించిన వైద్య బృందానికి.. గ్రీన్‌ఛానల్‌తో అవయవాలు వేగంగా చేరేందుకు సహకరించిన నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. నరేష్ చనిపోతూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.