ఢిల్లీలో విపరీతంగా పెరుగుతున్న హెచ1ఎన1 కేసులు
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): దేశ రాజధాని న్యూఢిల్లీలో హెచ1ఎన1 ఫ్లూ తీవ్రస్థాయిలో పంజా విసురు తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. గతేడాది 229 కేసులు మాత్రమే నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరంలో ఏకంగా 1,777 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రాజధానిలోని ఆసుపత్రుల్లో న్యుమోనియా, ఆక్సిజన్ కొరత, సుదీర్ఘ దగ్గు వంటి తీవ్రమైన లక్షణాలతో రోగులు చేరుతుండటంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే దేశంలో ఎలాంటి కొత్త వైరస్ రూపాంతరం చలామణిలో లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్పష్టం చేసింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో హెచ1ఎన1 ఫ్లూ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరంలో ఏకంగా 1,777 హెచ1ఎన1 కేసులు నమోదు అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన 229 కేసులతో పోలిస్తే.. ఇది భారీ పెరుగుదల. ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజే 114 కొత్త కేసులు బయటపడటంతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది నమోదైన మొత్తం ఇన్ఫ్లుయెంజా ‘ఎ’ కేసుల్లో హెచ1ఎన1 రకమే అత్యధికంగా ఉండటం గమనార్హం.
కొత్త స్ట్రెయిన్ కాదు.. ఐసీఎంఆర్ స్పష్టత
కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఏదైనా కొత్త లేదా తీవ్రమైన వైరస్ రూపాంతరం చెంది వ్యాపిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమఆర్) స్పందిస్తూ.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న హెచ1ఎన1 వైరస్ గత ఏడాది 2025 నుంచి చలామణిలో ఉందని.. ఎలాంటి కొత్త స్ట్రెయిన్ బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత టీకాలు ఈ వైరస్ను సమర్థవంతంగా అడ్డుకోగలవని ఐసీఎంఆర్ సైంటిస్టులు తెలిపారు.
ఎయిమ్స్ (ఏఐఐఎమఎస్), ఇతర ప్రముఖ ఆసుపత్రుల వైద్యుల ప్రకారం.. ఇన్ఫ్లుయెంజా వైరస్లలో కాలక్రమేణా చిన్నచిన్న జన్యు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం, వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గతంలో ఈ వైరస్ సోకితే.. సాధారణంగా శ్వాసకోస సమస్యలే కనిపించేవి. కానీ ఈసారి రోగులలో సుదీర్ఘంగా ఉండే తీవ్రమైన దగ్గుతో పాటు విరేచనాలు, కడుపు నొప్పి వంటి జీర్ణకోశ సమస్యలు, న్యుమోనియా, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో కిడ్నీ సంబంధిత కాంప్లికేషన్లు కూడా వస్తున్నాయి.
ఎవరకి ఎక్కువ ప్రమాదం?
చిన్న పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తులు, గుండె వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ ఫ్లూ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. అయితే ఫ్లూ సోకిన ప్రతి ఒక్కరికీ యాంటీవైరల్ మందులు అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు, హై-రిస్క్ వర్గాల వారు మాత్రమే వైద్యుల సలహాతో ‘ఓసెల్టామివిర’ వంటి యాంటీవైరల్ ఔషధాలను వాడాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోపే ఈ మందులు వాడితే మెరుగైన ఫలితం ఉంటుంది.
పాటించాల్సిన జాగ్రత్తలివే..!
ప్రస్తుత పరిస్థితి కలవరపరిచేదిగా ఉన్నప్పటికీ.. సకాలంలో వైద్య సాయం పొందడం వల్ల ప్రమాదాన్ని నివారించవచ్చు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెచ1ఎన1 నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వివరిస్తున్నారు.