ఘనంగా నేత్రదాన పక్షోత్సవాల అవగాహన ర్యాలీ
అక్షర కిరణం, (శ్రీకాకుళం): కార్నియా సేకరణతో సమాజంలో అంధత్వాన్ని పారద్రోలడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్.పుష్పలత పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మగటపల్లి నేత్ర శాఖ కేంద్రం నిర్వహిస్తున్న 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై రెడ్ క్రాస్ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు 8వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా కంటిచూపు మందగించిన వారికి చికిత్సలు అందించడంతోపాటు విస్తృతస్థాయిలో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మరణా నంతరం నేత్రదానం చేయడం వల్ల మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాము లు కావాలని సూచించారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రంతో ఇప్పటివరకు 597 మంది మరణానంతరం నేత్ర దానం చేసినట్లు వెల్లడించారు. అనంతరం రెడ్ క్రాస్ పరిపాలనా భవనం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ, ప్లకార్డుల ప్రదర్శనతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. నేత్రదానంపై పాల్గొన్న సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు .చిన్మయరావు, పరిపాలనాధికారి నర్సింగ రావు, గుణాకరరావు, కే.సత్యనారాయణ, జి.రమణ, పి.సుజాత, బి.సతీష్ కుమార్, ఎన్.హర్షవర్ధన్ సహా యూత్ రెడ్ క్రాస్ వలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.