మూడు జిల్లాలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో 29కి పెరగనున్న జిల్లాలు
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు: సీఎం
అక్షర కిరణం, (అమరావతి): రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం జిల్లా: రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్ లో యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది.
మార్కాపురం జిల్లా : యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది.
మదనపల్లి జిల్లా: మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది.
వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన విడుదల కానుంది.