బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ
కఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం
కసీఎం స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ సందర్భంగా సమావేశమైన కొద్ది గంటలకే ఓపీఎస్ ప్రకటన
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు గురువారం (జులై 31న ) ప్రకటించారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓపీఎస్.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు ముఖ్య మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ సందర్భంగా సమావేశమైన కొద్ది గంటల్లోనే పన్నీర్ సెల్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇదే సమయంలో, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కొద్ది రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వంపై పన్నీర్‌సెల్వం తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు ‘సమగ్ర శిక్షాభియాన్’ నిధులను విడుదల చేయక పోవడంపై ఆయన మండిపడ్డారు. విద్యార్థులు, ఉపాధ్యా యులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఓపీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 2022లోనే అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వంను బహిష్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. తమిళనాడు సర్కారు జాతీయ విద్యావిధానంలో భాగ మైన త్రిభాషా సూత్రాన్ని అమలు చేయక పోవడం వల్లే 2024-25 సంవత్సరానికి చెందిన రూ.2,151 కోట్ల సమగ్ర శిక్షాభియాన్ నిధులను నిలిపివేసినట్లు చెప్పారు. దీనిపై పన్నీర్‌సెల్వం స్పందిస్తూ.. ఇది దారుణమై నిర్ణయమని, విద్యా రంగాన్ని దెబ్బతీసే చర్య అని ఆరోపించారు.
కాగా, ఎన్డీయే నుంచి పన్నీర్‌సెల్వం వైదొలగడాన్ని రాజకీయ విశ్లేషకులు... భవిష్యత్తులో డీఎంకేతో పొత్తు దిశగా ఆలోచలో ఉన్నారని తెలిపారు. అయితే, ఈ విషయమై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా, 2023లో ఎన్డీయే నుంచి బయటకు కొచ్చిన అన్నాడీఎంకే.. ఇటీవలే బీజేపీతో మళ్లీ జట్టుకట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే, నటుడు విజయం కొత్త పార్టీ టీవీకే, బీజేపీ-అన్నాడీ ఎంకే కూటమి మధ్య త్రిముఖ పోరు తప్పదని భావిస్తున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన విజయ్ కు ఇవే తొలి ఎన్నికలు. తొలిసారి ఆయన ప్రత్యక్ష రాజకీయా ల్లోకి వచ్చి.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.