జలధార వద్ద బలవంతపు టోల్ వసూళ్లు..
ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్న వైనం స్థానికుల ఆగ్రహం మినహాయింపు కల్పించాలని డిమాండ్
అక్షర కిరణం, (మాధవధార): కార్తీకమాసం జలధారకు వచ్చే భక్తులకు టోల్గేట్ మినహాయింపు కల్పించాలని పలువురు కోరుతున్నారు. టోల్గేట్ బలవంత పు వసూళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ గేట్ వసూళ్లుకు తగ్గట్టు పార్కింగ్ సదుపాయం లేదని వాహన దారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీకమాసం మాధవ ధారలో ఉన్న జలధారకు వచ్చే భక్తులకు టోల్గేటు ఉపశమనం కల్పించాలని స్థానికులు,భక్తులు,మహిళలు కోరుతున్నారు. అయ్యప్పస్వామి భక్తులు, మహిళలు మాధవ ధారలో ఉన్న జలధారకు విచ్చేసి పవిత్ర స్నానాలు చేస్తుంటారు. మాధవదార వద్ద మాధవస్వామి, వేణుగోపాల స్వామి, శివాలయంకు భక్తులు కార్తీక, మాఘా మాసంలో విచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నిత్యం ప్రవహిస్తూ ఉండే జలధారకు మాలధారణ ధరించిన భక్తులు,మహిళలు వస్తూ ఉంటారు. మాధవదారలో ఉన్న శ్మశాన వాటికకు కూడా కర్మలు నిర్వహించేందుకు వస్తూంటారు. అటువంటి వారి దగ్గర టోల్గేట్ నిర్వహకులు బలవంతంగా టోల్ వసూలు చేస్తున్నారు. డబ్బు కడితే పైకి వాహనంతో వెళ్ళండి లేకుంటే నడుచుకొని వెళ్లండి అని బదులిస్తున్నారు. సింహాచలం దేవస్థానం వంటి దేవాలయంలో కూడా స్థానికులకు టోల్గేట్ మినహాయింపు ఉంటుంది కానీ, మాధవధారలో స్థానికులకు టోల్గేట్ మినహాయింపు ఉండదని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. బలవంతపు వసూళ్లకు తగ్గట్టు కొండపైన పార్కింగ్ సదుపాయం కూడా లేదు. అదేంటని స్థానికులు ప్రశ్నిస్తే పార్కింగ్తో మాకు సంబంధం లేదని, కేవలం టోల్ గేట్ రుసుము వసూలు మాత్రమే చేస్తామని బదులిస్తున్నారు. జలధార వద్ద స్నాన చేసే మహిళలకు స్నానపుగదులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. సింహాచల దేవస్థానం అధికారులు తక్షణమే పర్యటించి స్థానికులకు, భక్తులకు కార్తీక, మాఘామాసంలో టోల్ వసూలు నిలిపివేయాలని, జలధార వద్ద కనీస ఏర్పాట్లు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.