మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు గడువు పెంపు
ఎక్సైజ్‌శాఖ కొత్త రూల్, 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ!
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తు గడువును పెంచింది. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 22తో గడువు ముగియనుండగా.. మరో రెండు రోజులు గడువు పెంచారు. రాష్ట్రంలో మొత్తం 3,650 మద్యం షాపుల లైసెన్స్‌ల రెన్యువల్ కోసం ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో మంగళవారం రాత్రి వరకు 3,173 షాపుల లైసెన్సీలు రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తులు రాగా.. ఎక్సైజ్ శాఖకు రూ.676 కోట్లు ఆదాయం వచ్చింది. ఏపీ ప్రభుత్వం అంచనా ప్రకారం మరో రూ.257 కోట్లు రావాల్సి ఉంది. ఒకవేళ బుధవారంలోపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే ఆ షాపులకు కొత్తగా లైసెన్స్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఏపీ ప్రభుత్వం లైసెన్స్ రెన్యువల్ నోటిఫికేషన్‌కు కౌంటర్‌గా కొంతమంది కొత్తగా ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మద్యం షాపుల లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకుంటే.. రూ.23 లక్షల నుంచి రూ.35.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రెన్యువల్ చేసుకోకకుండా అలాగే షాపును వదిలేస్తే కొత్త లైసెన్స్‌ల కోసం ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాలి. అప్పుడు 4 దరఖాస్తులు కలిపి రూ.12 లక్షలు కడితే లాటరీలో లైసెన్స్ తిరిగి మనకే వస్తుందిలే అని కొందరు మద్యం వ్యాపారులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఎక్సైజ్ అధికారులు కొత్త నిబంధనను తీసుకురావాలని భావిస్తున్నారు. ఒకవేళ కొత్తగా మద్యం షాపుల కోసం లైసెన్స్‌లు జారీ చేసేందుకు లాటరీ తీయాలంటే ఒక్కో షాపునకు కనీసం 4 దరఖాస్తులు రావాలనే నిబంధనను పక్కన పెట్టి.. ఒక్కో షాపునకు కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీసేలా సవరించాలని భావిస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 A4 షాపుల నోటిఫై చేయగా.. రెన్యువల్, దరఖాస్తు రుసుముల కింద మొత్తం రూ.933.44 కోట్లు రావాలి.. సోమవారం రాత్రికి ఇందులో రూ. 676 కోట్లు మాత్రమే వసూలైంది. మరో రూ.257 కోట్లు రావాల్సి ఉంది. వార్షిక ఆరఈటీ కంపోనెంట్ కింద రూ.2,454.76 కోట్లు ఉంటే.. ఇప్పటి వరకు రూ.441 కోట్లు మాత్రమే వచ్చాయి. పర్మిట్ రూమ్ ఆరఈటీ డిమాండ్ రూ.249.15 కోట్లు కాగా.. రూ.62 కోట్లు వచ్చింది. ఇమొత్తం వార్షిక డిమాండ్ రూ.3,637.35 కోట్లు ఉంటే..సోమవారం సాయంత్రానికి రూ.1,179.63 కోట్లు వసూలైందని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.