ముంపు పొలాల్లో నీటిని మళ్లించి.. పంట నష్టాన్ని నివారించండి
Åకలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అక్షరకిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాలో వరద ముంపునకు గురైన వ్యవసాయ పొలాల్లో పేరుకు పోయిన నీటిని తక్షణమే బయటకు పంపి, నీరు దిగువకు వెళ్లే మార్గాల్లో ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వరద ప్రభావిత రైతుల వివరాలను నమోదు చేసి, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం వారికి అవసరమైన యూరియా, పొటాష్ ఎరువులను అందించేందుకు జాబితాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలు, ఇళ్ల లోకి చేరిన బురదను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించా లని పారిశుధ్య అధికారులకు పిలుపునిచ్చారు. నీటి పైప్ లైన్లు మునిగిపోయిన ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షలు పూర్తి చేసి, స్వచ్ఛత ధ్రువీకరణ పొందిన తర్వాతే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని సూచించారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలతోపాటు వ్యవసాయ ఫీడర్ల కు ఈరోజు మధ్యాహ్నానికల్లా విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించాలని ఆదేశించారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బయటి ఆహార పదార్థాలు తినకూడదని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కఠిన పారి శుధ్య చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయి ఆస్తి, పంట నష్టాల నివేదికను సత్వరమే సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ను ఆదేశించారు.