సర్పంచ్ హత్య కేసుతో మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా
అక్షర కిరణం, (మహారాష్ట్ర/జాతీయం): మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్.. ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మంత్రి ధనంజయ్ ముండే పేరు వినిపిస్తుండగా.. పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈక్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ధనంజయ్ ముండేకు సూచించారట. దీంతో ఆయన కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. సీఎం కూడా స్పందించారు. ధనంజయ్ ముండే రాజీనామాను తాను ఆమోదించి.. గవర్నర్ వద్దకు పంపినట్లు తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మహారాష్ట్రలోని బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9వ తేదీన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై దారుణంగా హింసించి హత్యకు పాల్పడ్డారు. అయితే ఈ హత్య కేసు బయటకు రాగా.. దీంట్లో మంత్రి ధనంజయ్ ముండే హస్తం కూడా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈయన సహాయకుడు వాల్మిక్ కరాడ్ ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారని తెలియగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. దీంతో మంత్రికి అత్యంత సన్నిహితుడు అయిన బాలాజీ తండాలే జైలుకి వెళ్లి మరీ నిందితుడిని కలిశారు. దీంతో మంత్రికి ఈ కేసుతో సంబంధం ఉందంటూ మరింతగా వార్తలు వచ్చాయి.
ప్రతిపక్షాలతోపాటు పలువురు మహాయుతి నాయకులు సైతం.. మంత్రి ధనంజయ్ ముండేపై విమర్శలు చేశారు. ఈకేసులో మంత్రిని తప్పించేందుకు దర్యాప్తు అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ గొడవ చేశారు. ముఖ్యంగా మంత్రి ధనంజయ్ ముండేకు గట్టి మద్దతు ఇస్తున్న ఎస్సీపీ చీఫ్ అజిత్ పవార్ సహా మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా చెప్పడంతో గొడవ మరింత ఎక్కువైంది.
మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ అనేక మంది ధనంజయ్ ముండేకు చెప్పడంతో.. ఆయన కూడా దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెబితే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈక్రమంలోనే గొడవ తగ్గించాలని భావించిన సీఎం.. ధనంజయ్ ముండేను మంత్రి పదవికి రాజీనామా చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆయన రాజీనామా చేశారట. అయితే దాన్ని ఆమోదించిన సీఎం.. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వద్దకు పంపారు. ఈ విషయాన్ని నేరుగా సీఎం దేవంద్ర ఫడ్నవీస్యే మీడియాకు తెలిపారు.