సింహాచల గిరిప్రదక్షిణలో బాలల హక్కులకు ప్రాధాన్యతనివ్వండి
కచైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఈనెల 9న సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లలో జరగనున్న గిరి ప్రదక్షిణలో మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది పిల్లలు, పెద్దలు హాజరయ్యే అవకాశమున్నందున, బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమంతో మమేకమై ఉన్న వివిధ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం, సింహాచల దేవస్థానం అధికారులు ఉమ్మడి చర్యలు చేపట్టాలని చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం కోరారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తమ ఫోరం తరపున సంభందిత శాఖల ఉన్నతాధికారులకు వీటికి సంభందిత లేఖలు రాసినట్టు చెప్పారు. ప్రధానంగా ఈగిరి ప్రదక్షిణ జరిగే మొత్తం ప్రాంతంలో పిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు, పిల్లల వైద్య నిపుణులతో కూడిన ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మందులు, అంబులెన్సులు అందుబాటు లో ఉంచాలని కోరారు. దారిపొడవునా ప్రభుత్వేతర (ఎన్జీఓ) సంస్థల సమన్వయంతో బాలల హక్కులు చట్టా లపై, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. అలాగే గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం సింహగిరిపై స్వామివారి దర్శనం కల్పించడంలో బాలలకు, గర్భిణీ, బాలింతలకు ప్రత్యేక క్యూ లైన్లు, లైన్లులో తల్లిపాలు పెట్టే ప్రత్యేక క్యాబిన్లు, వేడిపాలు, బిస్కెట్లు విరివిగా సరఫరా చేసేలా ప్రణాళికాయుత చర్యలు చేపట్టి బాలల హక్కుల పరిరక్షణకు పూర్తి ప్రాధాన్యత కల్పించాలని లేఖల్లో కోరినట్టు సీతారాం తెలిపారు.