27న పీవోడబ్ల్యు మహాసభలు విజయవంతం చేయాలంటూ ప్రచారం
అక్షర కిరణం, (పలాస): ఆంధ్రప్రదేశ్‌లో నూతన కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు పోతన పల్లి కుసుమ, కుత్తుం హేమక్క, బర్ల జానకమ్మ డిమాండ్ చేశారు. మద్యం, డ్రగ్స్, పోర్నోలతోపాటు అశ్లీల వెబ్సైట్లను ప్రభుత్వం నిషేధించాలని కోరారు. మంగళవారం పలాస మండలం సూదికొండ కాలనీలో ప్రగతిశీల మహిళా సంఘం నిర్వహించిన ప్రచార ర్యాలీలో వారు మాట్లాడారు.
ఈనెల 27న శ్రీకాకుళంలో జరపతలపెట్టిన పీవోడబ్ల్యూ జిల్లా 7వ మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు. మహిళల మిస్సింగ్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్‌ను అడ్డు కొనేందుకు ప్రభుత్వం దృష్టినిపెట్టాలని మహిళా చట్టాల్ని పటిష్టంగా అమలు చేయాలని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర మహిళా-శిశుసంక్షేమానికి నిధులను కేటాయించాలని వాకపల్లి అమానుష అత్యాచారంపై ఆది వాస మహిళలకు వ్యతిరేకంగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలని డిమాండ్ చేశారు. దోషుల్ని గుర్తించేందుకు సమగ్ర విచారణను చేప ట్టాలన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ మహిళా కార్యకర్తలు, సూదికొండ కాలనీ ప్రజలు, అఖిల భారత రైతుకూలీ సంఘ జిల్లా నాయకులు బాలకృష్ణ, మాధవరావు, అప్పయ్య, ప్రగతి శీల యువ జన సంఘ జిల్లా నాయకులు సారజగన్, ఐఎఫ్టీయూ నాయకులు గోపి, మల్లిబాబు పాల్గొన్నారు.