చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ
Åస్వర్ణాంధ్ర` స్వచ్ఛాంధ్రలో సీఎం నారా చంద్రబాబు నాయుడు
అక్షర కిరణం, (గుడివాడ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి రాష్ట్రంలో చెత్తలేకుండా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గుడివాడలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పరిశీలించిన సీఎం.. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మెప్మా మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను తిలకించారు. వారి ప్రతిభను అభినం దించారు. ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త కార్యక్ర మం కింద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీ లించిన సీఎం.. మహిళా సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
ఓ స్టాల్ వద్ద వెదురుతో తయారు చేసిన టోపీని ధరించి కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం గుంటూరు, నెల్లూరు చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్‌గా ప్రారంభించారు. నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి చంద్రబాబు పురస్కారాలను ప్రదానం చేశారు.
అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. అక్టోబర్ 2 నాటికి చెత్తలేకుండా చేస్తామన్నారు. మే 23 నుంచి జూన్ 20వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఆగస్టు 26 నాటికి రాష్ట్రంలో మరో1140 ఈ-ఆటోలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. రూ.528 కోట్ల ఖర్చుతో108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛరథాల ద్వారా చెత్తను కొనుగోలు చేసి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని.. ఇందుకోసం ఇప్పటి వరకూ రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అలాగే రాబోయే రోజులలో ఎవరి ఇంటిపై వారే కరెంట్ తయారుచేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.