మొంథా తుఫాన్ జాగ్రత్త చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అక్షర కిరణం, (అమరావతి): మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందిం చాలి. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పునరా వాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని కోరారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తుఫాన్ రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. వలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని సీఎంకు వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందుతుందని, ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపడకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసు కోవాలని కోరారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్ లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని సీఎం చంద్రబాబు కోరారు.