ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు
Åభోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ పీఎంకు ఆహ్వానం
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించాలంటూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, లోక్సభలో తెలుగుదేశం పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయనగరం లోక్సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి, విమానాశ్రయాల విస్తరణ, కేంద్ర--రాష్ట్ర సమన్వయంతో అమలవుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ జరిగింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి, పారిశ్రామిక పెట్టుబడులకు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.