అమర్నాథ్ యాత్రలో అదుపుతప్పి ఇంటిపై పడిన బస్సు
Å39 మందికి తీవ్ర గాయాలు
అక్షర కిరణం, (అమర్నాథ్/జాతీయం): జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో ఘోర మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి నేరుగా ఓ ఇంటిపై పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 39 మంది గాయపడ్డారని అధికారు లు తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ఉపద్రవం తొలిగిపోయింది. బస్సు ఆ ఇంటిపై పడి ఆగిపోవడం వల్లే పక్కనే ప్రవహిస్తున్న సింధు నదిలోకి జారిపడకుండా ఉండిపోయిందని.. ఒకవేళ నదిలో పడి ఉంటే ఊహించని రీతిలో నష్టం జరిగేదని అధికారులు భావిస్తున్నారు.
కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర..
ఈ ఘోర ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెంటనే స్పందించారు. ప్రమాద వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ పరిణామాలపై ఆయన ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేస్తూ యాత్రికుల ఆరోగ్యంపై ఆరా తీశారు. మరొకవైపు పవిత్ర అమర్నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున జమ్మూ బేస్ క్యాంప్ నుంచి 3,029 మంది యాత్రికులతో కూడిన మరో నూతన బృందం దర్శనం కోసం బయల్దేరి వెళ్లింది.
రికార్డు స్థాయికి చేరువలో భక్తుల సంఖ్య..
జులై 3న ప్రారంభమైన ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. సోమవారం నాటికి పవిత్ర గుహలోని మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఏకంగా.. 4.22 లక్షల మార్కును దాటింది. గతంలో అంటే 2024లో 5.2 లక్షల మంది, గతేడాది అంటే 2025లో 4.14 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అమర్నాథ్ యాత్రా చరిత్రలోనే 2011లో నమోదైన 6.30 లక్షల మంది అత్యధిక భక్తుల ఆల్టైమ్ రికార్డుగా నిలిచింది