టీడీపీతో 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై
Åపార్టీకి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి రాజీనామా Å22న వైసీపీలో చేరిక ?
అక్షర కిరణం, (శ్రీకాకుళం): ఉత్తరాంధ్ర రాజ కీయాల్లో, టీడీపీలో సీనియర్లుగా ఉన్న గుండ కుటుంబం 40 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పింది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా చేస్తున్నాట్టు ప్రకటించారు. 40 ఏళ్లుగా తాను, తన భర్త టీడీపీలో పనిచేశామని.. ఇప్పుడు పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా పార్టీ లో తమను, తమ అనుచరుల్ని ఇబ్బంది పెట్టారని.. తన భర్త విగ్రహం కోసం పెట్టిన దిమ్మెల్ని కూల్చేశారన్నారు. ఈ అవమానాలు భరించ లేక టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న సమయంలో గుండ లక్ష్మీదేవి ఆవేదనతో కన్నీళ్లుపెట్టుకున్నారు.
నందమూరి తారకరామరావు పిలుపు మేరకు తన భర్త గుండ అప్పల సూర్యనారాయణ టీడీపీలో చేరారన్నారు లక్ష్మీదేవి. ఆయనతో పాటుగా తమ కుటుంబం పార్టీలో చేరి 40 ఏళ్లుగా కొనసాగుతున్నామన్నారు. తన భర్త నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశారని.. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేశామని.. 2024లో తనకు సీటు ఇవ్వకపోయినా సరే తమ కుటుంబం టీడీపీని నమ్ముకుందన్నారు. తన భర్త పదేళ్లుగా మనస్తాపంతో ఉన్నారని.. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామ న్నారు. తన భర్త చనిపోయిన తర్వాత తమ కుటుంబాన్ని, అనుచరుల్ని అవమానించారని, ఇబ్బందిపెట్టారని భావోద్వే గంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే.. గుండ లక్ష్మీదేవి అనుచరులతో కలిసి గురువారం (అక్టోబర్ 22న) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీదేవితోపాటుగా అనుచరులు భారీగా వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గుండ లక్ష్మీదేవి కుటుంబం టీడీపీని వీడటం చర్చనీయాంశమైంది. గుండ లక్ష్మీదేవి కుటుంబాన్ని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.. కానీ వారు మాత్రం పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న గుండ లక్ష్మీదేవి కుటుంబానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటుగా పలువురు నేతలు టచ్లోకి వెళ్లారు.. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. దీనికి తోడు శ్రీకాకుళం మేయర్ పదవి జనసేనకు కేటాయించడంతో గుండ లక్ష్మీదేవి అసంతృప్తితో ఉన్నారు. లక్ష్మీదేవి కుటుంబం అనుచరులతో సమావేశమై వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
గుండ కుటుంబం 40 ఏళ్లుగా టీడీపీలో ఉంది. గుండ అప్పల సూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకు శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో అప్పల సూర్యానారయణ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో గుండ లక్ష్మీదేవి టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు.. 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో లక్ష్మీదేవికి టికెట్ దక్కలేదు.. అయినా సరే టీడీపీలో కొనసాగారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్నా తమను అధిష్ఠానం పట్టించుకోలేదని ఆవేదనలో ఉన్నారు. శ్రీకాకుళంలో పరిస్థితుల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందించలే గుండ ఫ్యామిలీ అసంతృప్తితో పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం.