రూ.4.52 కోట్లతో ఆధునాతన పరికరాలతో జీజీహెచ్‌లో వైద్య సేవలు బలోపేతం
Åఏపీలో అత్యుత్తమ హెల్త్ సిటీగా శ్రీకాకుళం జీజీహెచ్ అభివృద్ధి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నాణ్యమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలనే లక్ష్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ సీఎసఆర్ నిధులు రూ.4.52 కోట్లతో నిర్మాణ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రూ.4.52 కోట్ల విలువైన అధునాతన వైద్య పరికరాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నిబద్ధతతో శ్రీకాకుళం జీజీహెచ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానని మంత్రి తెలిపారు. డయాగ్నస్టిక్ పరీక్షలకు అవసరమైన పరికరాలు అందు బాటులో లేవని వైద్యులు తన దృష్టికి తీసుకురావడంతో 12 విభాగా లకు సంబంధించి 72 పరికరాలను సమకూర్చినట్లు వివరించారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరికరాలతో వైద్య పరీక్షలు, చికిత్సల్లో సమయం గణనీయంగా ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. గతంలో రోజుకు 60 శాంపిళ్లను మాత్రమే పరీక్షించే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం గంటకు 60 శాంపిళ్లను పరీక్షించే స్థాయికి సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. గతంలో నాలుగు గంటల సమయం పట్టే కొన్ని శస్త్ర చికిత్సలు ఇప్పుడు 15 నిమిషాల్లో పూర్తి చేసే సామర్థ్యాన్ని అందించే పరికరాలు కూడా అందు బాటులోకి వచ్చాయని చెప్పారు. జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు శ్రీకాకుళం జీజీహెచ్‌కు వస్తుంటారని మంత్రి తెలిపారు. అవసరమైన పరికరాలు లేకపోవడంతో కొంతమంది రోగులను కేజీహెచ్‌కు రిఫర్ చేయాల్సి వచ్చేదని, దీనివల్ల రోగులు అదనపు ప్రయాణ ఖర్చులు, సమయభారం ఎదు ర్కొనేవారన్నారు. ప్రస్తుతం అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడంతో స్థానికంగానే మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు.
రూ.4.52 కోట్ల విలువైన ఈ పరికరాల ద్వారా ప్రతి సంవత్సరం రోగులకు సుమారు రూ.17 కోట్ల మేర వైద్య ఖర్చుల భారం తగ్గించే అవకాశం ఉందని మంత్రి వివరించారు. పరికరాల వినియోగం, పనితీరును ప్రతి నెలా శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్‌తో కలిసి సమీక్షిస్తానని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీజీహెచ్‌లో 3,30,255 మంది ఔట్ పేషెంట్లు (ఓపీ) సేవలు పొందగా, 2025-26లో ఈ సంఖ్య 4,59,663కు చేరిందని మంత్రి తెలిపారు.
జీజీహెచ్‌లో చదువుతున్న వైద్య విద్యార్థులు కూడా ఈ మార్పులకు ప్రచారకర్తలుగా మారాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శ్రీకాకుళం జిల్లాకు అధునాతన వైద్య పరికరాలను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే బోయింగ్ సంస్థతో చర్చించి రూ.43 లక్షల విలువైన మరో వైద్య పరికరాన్ని సమకూర్చినట్లు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో రూ.కోటి నిధులను తీసుకొచ్చినట్లు వివరించారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యుత్తమ హెల్త్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ సంకల్పమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐ.ఓ.సి.ఎల్ ఈ.డి. ఎస్.హెచ్, పీయూష్ మిట్టల్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, మామిడి గోవిందరావు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మయూర్ పట్నాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.