భోగాపురం విమానాశ్రయం కొత్త అప్డేట్
కవిశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 60 కిలోమీటర్ల ఏవియేషన్ టర్బైన్ పైప్‌లైన్
అక్షర కిరణం, (భోగాపురం): ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చాలా వరకూ పూర్తయ్యాయి. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేరకు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు నిర్ణయించింది.
ఇది ఏర్పాటైతే రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధికి కీలకంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అవసరాలను తీర్చడంతో పాటుగా రాష్ట్రంలో విమానయాన రంగం వృద్ధికి మద్దతు ఇస్తుందని అంటున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే.. రోడ్డు రవాణాపై ఆధారపడడాన్ని తగ్గుతుందంటున్నారు.
మరోవైపు ఈ పైప్‌లైన్ సామర్థ్యం.. ఏడాదికి కనీసం 0.5 మిలియన్ టన్నులు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు ఈ పైప్ లైన్ ఏర్పాటును సొంతంగా ప్రతిపాదించింది. ఈ పైప్‌లైన్ ఏర్పాటు గురించి ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ముందడుగు వేసే ఆలోచనలో ఉన్నారు. ఇండక్టివ్ రూట్ మ్యాప్ ప్రకారం.. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానా శ్రయం వరకూ ఈ ఏవియేషన్ టర్బ్నై ఫ్యూయల్ పైప్‌లైన్‌ను.. తీరం వెంబడి ఏర్పాటు చేయనున్నారు.
కాపులుప్పాడ, భీమిలి, తగరపువలస వంటి ప్రాంతాల గుండా ఈ పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పైప్‌లైన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. విశాఖలోని వనరుల నుంచి ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఫ్యూయెల్ స్టోరేజీకి నేరుగా తరలించడమే.
ఇలా పైప్‌లైన్ ద్వారా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ తరలించే ప్రక్రియను పైప్‌లైన్ రీఫ్యూయలింగ్ అని అంటారు. సాధారణంగా రోడ్డు మార్గం ద్వారా విమానాలకు కావాల్సిన ఇంధనాన్ని తరలిస్తూ ఉంటారు. అయితే ట్రాఫిక్ సమస్యలు, పర్యావరణ కారణాలతో పాటుగా రోడ్డు మార్గంలో తరలించడంలో ఖర్చులు ఎక్కువని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పైప్ లైన్ రీఫ్యూయలింగ్ పద్ధతి అనుసరించాలని భావిస్తున్నారు. పైప్‌లైన్ ద్వారా అయితే నిరంతరం , అధిక పరిమాణంలో, సురక్షితంగా ఇంధనం తరలించవచ్చనేది ఆలోచన. దీని ద్వారా ఎయిర్ పోర్టు కూడా రోడ్డు రవాణాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెప్తున్నారు.