శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి దానంపై అవగాహన ర్యాలీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): కంటి దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, నాయుడుతోట ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రహ్లాదపురం మీదుగా గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు సాగి, తిరిగి ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు ‘కంటి దానం చేయండి- మరొకరి జీవితంలో వెలుగు నింపండి’ వంటి నినాదాలతో ప్రజలకు కంటి దానంపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన ర్యాలీని మెడికల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైనింగ్, హెచఓడీ- కార్నియా డైరెక్టర్ డాక్టర్ నస్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ యశస్విని, డాక్టర్ ప్రవళిక, డీఎన్బీ వైద్యులు, కేవీ వేణుగోపాల్, ఎస్.కె.ఎల్. రావు, ఆసుపత్రి సిబ్బంది , కళాశాల అధ్యాపకులు, విద్యార్థు లు పాల్గొన్నారు. డాక్టర్ నస్రీన్ మాట్లాడుతూ కంటి దానం ఒక మహోన్నతమైన మానవతా సేవ అన్నారు. నేత్రదానం తో చీకటిలో జీవిస్తున్న వారికి వెలుగును, ఆశను అందించి వారి జీవితాల్లో కొత్త మార్పును తీసుకురావచ్చని తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ తమ కళ్లను దానం చేయడానికి ప్రతిజ్ఞ చేయడంతోపాటు, నేత్రదానంపై తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ అవగాహన ర్యాలీకి అనుమతి మంజూరు చేసి, కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖకు శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ కె బంగార్రాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.