అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ల ప్లాంట్
తొలి దశలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి
అక్షర కిరణం, (అనకాపల్లి/జాతీయం): ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్‌లకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ ‘ఏఎం/ఎన్ఎస్’ ముందుకొచ్చింది. నిప్పన్ స్టీల్స్ అనే జపాన్ కేంద్రంగా, ఆర్సెలార్ మిట్టల్ అనేది లగ్జంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు స్టీల్ తయారీ కంపెనీలు కలిసి ‘ఏఎం/ఎన్ఎస్’ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటుచేశాయి. ఇప్పుడు ఈ కంపెనీయే నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్లాంటు ఏర్పాటుకు మొత్తం రెండు దశల్లో పెట్టుబడులు పెడతామన్న కంపెనీ.. తొలిదశలో రూ.70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడిరచింది.
నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ‘ఏఎం/ఎన్ఎస్’ కంపెనీ తెలిపింది.మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో, రెండో దశలో 10.5 ఎంఎటీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో స్టీలు ప్లాంట్ పనిచేస్తుందని పేర్కొంది. ప్లాంట్ నిర్మాణ సమయంలో మరో 25 వేల మందికి, తర్వాత కార్యకలా పాలు, నిర్వహణ కోసం సుమారు 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. స్టీల్ ప్లాంట్, పోర్టు, రైల్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులను కంపెనీ కోరింది. అనకాపల్లి బల్క్‌డ్రగ్ పార్కు కోసం ప్రతిపాదించిన 2,200 ఎకరాలను మొదటి దశ స్టీలు ప్లాంట్ నిర్మాణానికి కేటాయి స్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. రెండో దశలో ప్లాంట్ నిర్మాణానికి సమీపంలోని మరో 3,800 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రపోజ్ చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ఎండీసీకి కేటాయించిన గనుల నుంచి ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజాన్ని తీసుకోనున్నట్లు ‘ఏఎం/ఎన్ఎస్’ కంపెనీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ముడి ఖనిజాన్ని స్లర్రీ పైపులైను ద్వారా విశాఖ ప్లాంట్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తయారు చేసిన పెలెట్లను ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్‌లోకి నేరుగా పంపే వెసులుబాటు కలుగుతుంది. ఏఎం/ఎన్ఎస్ జాయింట్ వెంచర్ కంపెనీ ఇప్పటికే వైజాగ్‌లో 8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పెల్లెట్ల తయారీ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది.