అనధికార నిర్మాణాలపై చర్యలు
అక్షర కిరణం వార్తకు స్పందన
అక్షర కిరణం (విశాఖ సిటీ): మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వెస్ట్ జోన్కు సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న అనధికారిక నిర్మాణాలపై ఎట్టకేలకు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. వెస్ట్ జోన్లో బిల్డర్లు బరితెగించి నిబంధనలను విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై అక్షర కిరణం సోమవారం ‘నిబంధనలు బైపాస్- అక్రమాలకు హైవే’ శీర్షికన వార్త ప్రచురించింది. మర్రిపాలెం కూడా లేఔట్లో టిడిఆర్ ముసుగులో అక్రమ నిర్మాణం నిర్మిస్తుండడంతోపాటు సెల్లార్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే అక్కడితో ఆగకుండా రోడ్డును ఆక్రమించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి సిమెంటు దిమ్మను కూడా నిర్మించారు. అదేవిధంగా భాజీ జంక్షన్లో రెడ్డి రామా లయం స్ట్రీట్లో మరో అనధికారిక నిర్మాణం కొనసాగుతోంది. అదే విధంగా గోపాలపట్నం కొత్తపాలెం ఆదర్శనగర్లో మరో బిల్డర్ నేడు రేపు స్లాబ్ వేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. ఈనేపథ్యంలో అక్షర కిరణం పత్రికలో వార్త వెలువడడం తో సీసీపీ ప్రభాకర్ రావు ఆదేశాలతో జోన్ ఏసీపీ రామలింగేశ్వర్ రెడ్డి టీపీవో గోపన్న ఆయా అక్రమ కట్టడాలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటల నుంచి మర్రిపాలెం ఉడా లే అవుట్ లో భారీగా నిర్మించిన అనధికారిక నిర్మాణాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. ముందుగా సెల్లార్లో నిర్మించిన షాపింగ్లను పూర్తిగా తొలగించారు. గోడలను నేలమట్టం చేశారు. రోడ్డుపై నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ సిమెంట్ దిమ్మను పూర్తిగా తొలగించారు. పలు అక్రమ కట్టడాలను పరిశీలించి ఆయ కట్టడాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.