చైన్ స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్టు
అక్షర కిరణం, (మాధవధార): ఈనెల 16వ తేదీన మాధవధార వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ కేసును కంచరపాలెం క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను కంచర పాలెం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశం లో క్రైమ్ ఏసీపీ వెంకటరావు, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ తిరుమలరావు తెలిపారు. మాధవధారకు చెందిన గాజుల కృష్ణకుమారి(48) ఈనెల 16న ఉదయం సుమారు 4 గంటల సమయంలో తన ఇంటి సమీపంలో పువ్వులు తెంపుతున్న సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 17.5 గ్రాముల బంగారు పుస్తెల తాడులిను అపహరించు కుపోయారు.
విషయం తెలుసుకున్న కంచరపాలెం క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సారా జయంత్ కుమార్(19), రాజేష్ అలియాస్ ధరణి(20) లను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
నిందితులకు సహకరించిన సింహాద్రి సాయి ప్రణయ్(19) కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి 14.416 గ్రాముల బంగారు పుస్తెల తాడుతోపాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన కంచరపాలెం క్రైమ్ బృందాన్ని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు. ఈ సమావేశంలో క్రైమ్ ఎసఐ డి. రమణమూర్తి తదితర సిబ్బంది పాల్గొన్నారు.