సరుకు అన్లోడ్ చేస్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ
Åఒకరి మృతి, మరోకరికి తీవ్ర గాయాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్టణంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కూలి పనులు చేసు కుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తి, ఎప్పటిలాగే సరుకు అన్లోడ్ చేస్తుండగా ఓ కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కన చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖలోని అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కన ఇద్దరు కూలీలు సరుకును అన్లోడ్ చేస్తున్నారు. ఇదే సమయంలో నేషనల్ హైవే కావడంతో అటుగా వచ్చిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. కూలీలిద్దరూ లారీలోని సరుకును అన్లోడ్ చేస్తుండటం తో.. కాంక్రీట్ లారీ ఒక్కసారిగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కూలీ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దాంతో గాయాలపాలైన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాంక్రీట్ లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో కాంక్రీట్ లారీ నేరుగా సరుకు అన్లోడ్ చేస్తున్న వాహనాన్ని ఢీ కొట్టలేదు. ఈ సరుకు అన్లోడ్ చేసే వాహనాన్ని ఢీకొట్టే ముందు.. బస్టాప్ సమీపంలోని గోడను ఢీకొట్టి.. అనంతరం ఇటుగా వచ్చి సరుకు వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో అన్లోడ్ చేస్తున్న కూలీలు కూడా ఇది గమనించకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని కూడా హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో నేషనల్ హైవే మీద కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ అలసట, నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని నిర్థారించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో రవాణా శాఖ అధికారులు డ్రైవర్ హాల్ట్లు కూడా ఏర్పాటు చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లాలని కూడా సూచించారు.