ఏపీలో రేషన్ కార్డుదారులకు దీపావళి కానుక
îరూ.250కే కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి
అక్షర కిరణం, (అమరావతి): ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో సరుకులు అందించడంపై ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ నిత్యావసర వస్తువుల ధరలను వీలైనంత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ షాపుల ద్వారా దీపావళి నాటికి ప్రజలకు నెలకు కిలో కందిపప్పును రూ.100, లీటరు పామాయిల్‌ను రూ.125, గోధుమ పిండి కిలో రూ.25కే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న సూపర్ ఫైన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుకను ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలను వీలైనంత వరకు తగ్గించి.. తక్కువ ధరలకు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి వంటి వస్తువులను తక్కువ ధరలకు అందించాలన్నారు. దీపావళి నాటికి రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ.25, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందించే పామాయిల్‌ను టెండర్ల ద్వారా సేకరించి సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుతున్నాయి.. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు తక్కువ ధరకు సరుకులు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు ధరణి బ్రాండ్‌తో కిలో రూ.49, రూ.50 చొప్పున ఫైన్, సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలపై సమీక్ష చేశారు.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటు మిల్లర్లు, హోల్‌సేల్ అసోసియేషన్ ప్రతినిధులతో అధికారులు చర్చించారు. బీపీటీ స్టీమ్ రకం బియ్యాన్ని కిలో రూ.66, సాధారణ స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.47కు మించకుండా విక్రయించే అంశంపై చర్చించి ఒప్పించారు. ధాన్యం, బియ్యం అక్రమంగా తరలించకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, టోల్గేట్ల వద్ద నిఘా పెంచాలని సీఎం సూచించారు. అంతేకాదు మార్కెట్ సెస్సు భారాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లి ధరలపైనా ఆరా తీశారు.. ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.35కే ప్రజలకు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మరో 800 టన్నులు ఉల్లిని ప్రజలకు తక్కువ ధరకు విక్రయిస్తామన్నారు. కర్నూలు నుంచి ఉల్లి మార్కెట్‌కు వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉల్లి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ ప్రభుత్వం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో నెలకు సుమారు రూ.100 కోట్ల భారం పడుతోందని అధికారులు చెప్పగా.. ప్రభుత్వానికి భారమైనా ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలన్నారు సీఎం.