15 ఏళ్లుగా పరారీలో ఉన్న 72 ఏళ్ల నిందితుడి అరెస్ట్
Åనిందితుడు హరిసింగ్ షేకావత్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ ప్రత్యేక పోలీసుల బృందం
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): పోలీసుల కళ్లుగప్పి 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వృద్ధ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల కిందట నమోదైన ఒక భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉండి, ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో తలదా చుకున్న ఆయనను.. పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
2008లో ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల తయారీ సంస్థలో పని చేస్తున్న సమయంలో.. హరి సింగ్ షెకావత్ సదరు యాజమాన్యం నుంచి అక్రమంగా డబ్బులు వసూ లు చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు వచ్చాయి. కంపెనీ ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తూ బెది రింపులకు పాల్పడినందుకు 2008 మార్చి 15న ఆయనపై బెదిరింపులు, వసూళ్ల యత్నం కేసు నమోదు చేశారు. కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన కోర్టు ఆదేశా లను ఉల్లంఘిస్తూ వరుసగా విచారణకు గైర్హాజరవుతూ వచ్చాడు. న్యాయస్థానం సమన్లను బేఖాతరు చేస్తూ తప్పిం చుకుతిరుగుతుండటంతో.. న్యాయస్థానం ఆయన్ను 2016 ఏప్రిల్ 2న పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించింది.
రాష్ట్రాలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి..!
అరెస్టు నుంచి, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవ డానికి షెకావత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. మొదట ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తన స్థావరాన్ని మార్చాడు. అక్కడ కొన్నాళ్లు ఉన్న తర్వాత తన గుర్తింపును దాచి పెడుతూ రాజస్థాన్‌కు చేరుకున్నాడు. సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి ఢిల్లీ స్పెషల్ సెల్‌కు చెందిన సౌత్-వెస్టర్న్ రేంజ్ బృందం విస్తృతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాదాపు నెలకు పైగా మానవ నిఘా నిర్వహించిన తర్వాత.. ఆగస్టు 13వ తేదీన షెకావత్ జైపూర్ నగరంలోని ఒక నివాస సముదాయంలో దాక్కున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది.
అర్ధరాత్రి ఆపరేషన్.. జైపూర్‌లో అరెస్ట్
దీంతో సబ్-ఇన్స్పెక్టర్ రాకేష్, సబ్-ఇన్స్పెక్టర్ విశాల్ తివారీ, హెడ్ కానిస్టేబుళ్లు నవీన్ చిల్లార్, నవీన్ శర్మ, కుల్దీప్లతో కూడిన ప్రత్యేక రైడింగ్ టీమ్ జైపూర్‌కు చేరుకుంది. సదరు రెసిడెన్షియల్ సొసైటీలో గాలించి, షెకావత్ ఉనికిని, ఆయన నివాసాన్ని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య సాగిన 15 ఏళ్ల వేటకు తెరపడింది.
ఉన్నత చదువులు.. ప్రముఖ కంపెనీల్లో కీలక పదవులు
పోలీసుల వివరాల ప్రకారం షెకావత్ సాధారణ వ్యక్తి కాదు. ఆయన ప్రముఖ విద్యా సంస్థ అయిన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎక్సఎలఆరఐ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గతంలో పలు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో ఒక గార్మెంట్ సంస్థలో పని చేస్తున్న సమయంలోనే ఈ వసూళ్ల దందాతో చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.