నేపాల్ ఆకస్మిక వరదల్లో 157 మంది మృతి..
Å133 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!
అక్షర కిరణం, (నేపాల్/ జాతీయం): నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. భోటే కోశి నది ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 157 మంది ప్రాణాలు కోల్పోగా.. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయులతో సహా వందలాది మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో నేపాల్ ప్రభుత్వం విస్తృ త స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి 10 టన్నుల విపత్తు సహాయక సామాగ్రిని వైమానిక దళ విమానంలో పంపించగా.. ప్రధాని మోదీ అందించిన సహకారానికి నేపాల్ ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు తెలిపారు.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం రోజు సాయంత్రం సంభవించిన ఘోర ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రవాహంలో ఇప్పటి వరకు కనీసం 157 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది జాడ తెలియకుండా పోయిం దని అధికారులు వెల్లడించారు. గల్లంతు అయిన వారిలో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఘటనా స్థలాల నుంచి నేపాల్ పోలీసులు ఇప్పటి వరకు 157 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న ముంపు ప్రాంతాల నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
విదేశీ పర్యాటకుల గల్లంతు.. శరవేగంగా సహాయక చర్యలు
ఈ ప్రకృతి విపత్తు సంభవించిన కొన్ని గంటల పాటు మొత్తం 403 మంది పర్యాటకుల సమాచారం లభించకుండా పోయిందని నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 341 మంది విదేశీయులు ఉండటం అంతర్జాతీయంగా కలవరపెడుతోంది. పర్యాటక బోర్డు వివరాల ప్రకారం.. గల్లంతైన విదేశీ పర్యాటకుల్లో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, సౌతాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. బురద, శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను, మృతదేహా లను వెలికితీసేందుకు నేపాల్ రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నేపాల్ ప్రధాని బలేంద్ర షా ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని వనరులను సహాయక చర్యలకు వినియోగిస్తామని హామీ ఇచ్చారు.
కొట్టుకుపోయిన గ్రామాలు.. నిలిచిన రవాణా
టిబెట్ వైపు నుంచి.. స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భోటే కోశి నది ద్వారా వర్షపు నీరు ఉప్పెనలా దూసుకొచ్చింది. దీనివల్ల టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వరద తీవ్రతకు అనేక గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయని నివారణ సహాయక చర్యల్లో పాల్గొంటున్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తు సమాచారం తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో వేగంగా స్పందించింది. భారత వైమానిక దళం ప్రత్యేక రవాణా విమానం ద్వారా 10 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రి, వైద్య పరికరాలను నేపాల్‌కు పంపింది.