ఫార్మా కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరామర్శ
విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన సీఎం
అక్షర కిరణం, (విశాఖపట్నం): అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. వారిలోనూ కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శిం చారు. క్షతగాత్రులను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ వారి పరిస్థితిని అక్కడే ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియతిరుగుతూ బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితుల కుటుంబసభ్యులతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడి వారికి మనోస్థైర్యం కల్పించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు మీరు ధైర్యంగా ఉండి క్షతగాత్రులకు ధైర్యం చెప్పండి అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, మాములుగా దెబ్బలు తగిలిన వారికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తాం. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామన్నారు. తాము అన్నీ చూసుకుంటామని.. ఎంత ఖర్చు అయినా అందర్నీ రక్షించుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట గంటా శ్రీనివాస్ రావు కూడా ఉన్నారు.