వీఎంఆర్డీఏలో సాంకేతిక విభాగం పనుల ప్రగతిపై సమీక్ష
అక్షర కిరణం, (విశాఖపట్నం): వీఎంఆర్డీఏ సమా వేశ మందిరంలో బుధవారం సాంకేతిక విభాగం చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, బోయపాలెం బృహత్తర ప్రణాళికా రహదారిలో మధ్యలో ఉన్న హెచ్ఐటీ ఎలక్ట్రికల్ లైన్స్‌ను తరలించి సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయా లని, మామిడిలోవ, గిడిజాలలో ఆర్సీ లేఅవుట్లలోని సీసీ కాలువలు, సీడీ వర్క్స్ పనులను గుత్తేదారుచే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, టీడీఆర్ సంబంధిత అంశా లపై అక్కడక్కడ నిలచిన బృహత్తర ప్రణాళికా రహదారుల నిర్మాణం విషయమై జీవీఎంసీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, నగర నడిబొడ్డులో ఉన్న ఎన్ఏడీ ఫ్ల్లైఓవర్ కు అనుబంధంగా చేపట్టిన ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణపు పనులు వేగవంతం చేయా లని ఆదేశించారు. ఇకపై ఇంజినీరింగ్ విభాగం చేపట్టే పనులను ఎట్టిపరిస్థితుల్లో నిర్ధిష్ట కాలపరిమితి లోపు పూర్తి చేయాలని, తదుపరి కాలపరిమితి పొడిగింపు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో ప్రధాన ఇంజనీర్ భవానీశంకర్, పర్యవేక్షక ఇంజినీర్ బలరామరాజు, కార్యనిర్వహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వహక ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు, పరిపాలనాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.