అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
నలుగురు కార్మికుల మృతి 14 మందికి తీవ్ర గాయాలు సీఎం, హోంమంత్రి స్పందన
అక్షర కిరణం, (రాంబిల్లి): రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందగా 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరినీ హుటాహుటిన అనకా పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి యాజమాన్యం తరలించింది. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది.
ఎసెన్సియా కంపెనీలో ఉద్యోగులు, కార్మికులంతా రోజువారి గానే పని చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీంతో దాదాపు 18 మంది వరకు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అనకా పల్లికి తరలించారు. వీరిలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మిగిలిన వారికి అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది చేరుకు ని మంటలు ఆర్పుతున్నారు. పరిశ్రమలో పలువురు కార్మి కులు చిక్కుకున్నారు. వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. భోజన సమయం కావడంతో కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు వచ్చారు. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు వచ్చారని, లేకుంటే మరింత ఘోరం జరిగేదని కార్మికులు చెప్తున్నారు. ప్రమాదంతో కంపెనీ పరి సర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హోంమంత్రి అనిత ఆరా..
ఫార్మా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు ప్రమాదంపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబం ధిత జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకు న్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని ఎంపీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ..
హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు రాంబిల్లి ఎస్సెనియా ఫార్మా కంపెనీ ప్రమాద స్థలాన్ని కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపిక సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, సిబ్బందిని అడిగి ఆరా తీశారు. పేలిన రియాక్టర్ శకలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని కలెక్టర్ అను మానం వ్యక్తం చేశారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
ఘటనపై సీఎం చంద్రబాబు స్పందన..
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులను అడిగి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.