శ్రావణమాసం... విశిష్టమైన మాసం.... తమ సౌభాగ్యాలు కాపాడమని, మహిళలు ఈ మాసములో మంగళ గౌరీకి భక్తిశ్రద్ధలతో పూజలు వ్రతాలు చేయడం తెలిసిందే. హిందూ సనాతన ధర్మం లో భర్తకు విశిష్టమైన స్థానం ఉంది. భర్త ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గృహిణి కోరుకుంటుంది. భర్త, పిల్లలు ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎదగాలని, నిండు నూరేళ్ల వరకు తన పసుపు కుంకుమలకు భంగం వాటిల్లకుండా చూడమని వరలక్ష్మిని మహిళలు వేడుకుంటారు. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజు తమకున్న ఆర్థిక స్తోమత బట్టి ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రకరకాల పిండి వంటలు, పళ్ళు, బంగారం వెండి అమ్మవారికి సమర్పించి వ్రతం చేస్తారు. ఈ మాసంలో ఏ స్త్రీ అయితే వరలక్ష్మిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారో ఆ స్త్రీ పసుపు కుంకుమలకు భంగం వాటిల్లకుండా అనుగ్రహిస్తానని అమ్మవారి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణం మాసం ప్రారంభం కావడంతో. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొంది. మహిళలు వేకువ జామున ఆలయాలకు వెళ్లడం కనిపించింది. ఈసారి శ్రావణ వారాలు ఐదు వచ్చినట్లు ఆలయ పురోహితులు చెబుతున్నారు.