పశ్చిమ బెంగాల్ మెడికల్ కాలేజీలో ఘోరం
Åమూడు వారాల్లోనే 60 మంది నవజాత శిశువులు మృతి
అక్షర కిరణం, (కోల్కతా/జాతీయం): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర అనుమా నాలు రేకెత్తిస్తూ.. ఒక ఘోర విషాదకర సంఘటన వెలుగు లోకి వచ్చింది. ప్రసిద్ధ మాల్డా వైద్య కళాశాల (ఎంఎం సీహెచ్) ఆస్పత్రిలో చోటుచేసుకున్న వరుస శిశు మరణాలు స్థానికులతోపాటు అధికారులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి కేవలం మూడు వారాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 60 మంది నవ జాత శిశువులు ప్రాణాలు విడిచారు. పసిపాపల వరుస మరణాలతో ఆసుపత్రి ఆవరణలో బంధువుల కన్నీటి రోదనలు మిన్నంటాయి.
ఒకేరోజు పదిమంది చిన్నారుల దుర్మరణం..!
ఈ వరుస విషాదాల్లో మరింత ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే.. ఆగస్టు నెల రెండో వారంలో ఒకే ఒక్క రోజు పది మంది నవజాత శిశువులు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒకేరోజు అంతమంది పసికందులు చనిపోవడంతో బెంగాల్ వైద్యారోగ్య విభాగం తీవ్రంగా పరిగణించింది. ఈ పసిపాపల మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించి, స్పష్టమైన వివరణ సేకరించేందుకు ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
ఇతర ప్రాంతాల నుంచి ఎంఎంసీహెచ్కు రిఫర్
ఈ ఘోర ఘటనపై స్థానిక అధికారులు ప్రాథమిక సమా చారాన్ని సేకరించి వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన మొత్తం 60 మంది చిన్నారులలో 44 మంది తొలుత తీవ్ర అనారోగ్య కారణాల వల్ల ఇతర విభిన్న ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. అయితే అక్కడ వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో.. మెరుగైన వైద్య సేవలు అందుతాయనే ఆశతో తల్లిదండ్రులు వారిని మాల్డా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన ప్పటికీ.. తీవ్ర అస్వస్థత వల్ల చికిత్స పొందుతూ ఆ పసిపాపలు మరణించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఒకేరోజు ప్రాణాలు కోల్పోయిన పది మంది చిన్నారుల్లో ఇద్దరు మాత్రమే ఈఎంఎంసీహెచ్ ఆస్పత్రిలో జన్మించగా.. మిగిలిన ఎనిమిది మంది ఇతర ప్రాంతీయ ఆసుపత్రుల నుంచి ఇక్కడికి రిఫర్ అయి వచ్చినవారేనని స్పష్టం చేశారు.
నిర్వహణా లోపాలు, వ్యాధులపై సమగ్ర విచారణ
ఈ మరణాలకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని ప్రాథమిక నివేదికలు అందాయి. శ్వాసకోశ సంబంధిత తీవ్రమైన సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత జబ్బుల కారణంగానే ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ నివేదికలలో వెల్లడించారు. అయితే ప్రాథమిక వైద్యం అందించిన ఆసుపత్రుల తీరుతోపాటు మాల్డా మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్వహణ, అక్కడ లభిస్తున్న అత్యవసర సౌకర్యాలు, వైద్య సేవల నాణ్యతపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. పసికందుల ప్రాణాలు కాపాడటంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.