ఖేల్ కూద్ పోటీల్లో సరస్వతి శిశుమందిర్ విద్యార్థిని గీత ప్రతిభ
అక్షర కిరణం, (సాలూరు): మామిడిపల్లి శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల ఐదవ తరగతి విద్యార్థి ఇల్లపు దొర గీత రాష్ట్ర స్థాయి ఖేల్ కూద్(ఆటల పోటీలు) పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, క్షేత్రస్థాయి పోటీలకు ఎంపికైంది. మామిడిపల్లి పాఠశాల కమిటీ సభ్యులు, ఆచార్యులు, మాతాజీలు, ప్రథమస్థానం సాధించడం గర్వకారణంగా ఉందని అభినందించారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో ఉన్న శ్రీసరస్వతీ శిశు మందిర్, భారతీయ విజ్ఞానకేంద్రం, విజ్ఞాన విహార పాఠశాల విద్యార్థుల మధ్య వివిధరకాల ఆటల పోటీలను పాఠశాల, జిల్లాస్థాయిలో నిర్వహించారు. ఇందులో రాణించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేసి ఇటీవల నరసారావుపేటలో పోటీలు నిర్వహించారు. కాగా రాష్ట్రస్థాయి ఆరువందల మీటర్ల పరుగుపందెం(అథ్లెట్) బాలల విభాగంలో గీత ప్రథమస్థానంలో నిలిచి, క్షేత్రస్థాయి పోటీలకు అర్హత సాధించడంతో తమ పాఠశాల విద్యార్థి గీత ప్రతిభను శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు వేముల గౌరి నాయుడు కమిటీ సభ్యులకు తెలియజేసారు. దీనితో శ్రీసరస్వతీ విద్యా పీఠం మామిడిపల్లి,పార్వతీ పురం మన్యంజిల్లా కార్యకారిణీ సభ్యులు రామకృష్ణ, శంకరరావు, తిరుపతిరావు, త్రినాథ రామారావు, వెంకటరమణ, బంగారునాయుడు, శ్రీసరస్వతీ విద్యాపీఠం సంస్కార కేంద్రాల సేవాప్రముఖ్ శ్రీనివాసరావు, ఆచార్యుల బృందం ఆదివారం పాఠశాలలో విద్యార్థినిని అభినందించారు. హెచ్ఎం గౌరినాయుడు విలేఖరులతో మాట్లాడుతూ శిశుమందిర్ విద్యార్థుల మధ్య ఈఏడాదిలో జరిగిన జిల్లా స్థాయి పోటీలో రాణించిన గీత రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం అద్భుతంగా రాణించి ప్రథమస్థానంలో నిలిచిం దన్నారు. ఐదు సమితుల విద్యార్థుల మధ్యజరిగిన పోటీల్లో ప్రథమస్థానం సాధించిన వారి మధ్య వచ్చే నెల 15, 16వ తేదీల్లో విజయవాడ కేంద్రంగా క్షేత్ర స్థాయి (ఏపీ, తెలంగాణ, కర్ణాటక) పోటీలను నిర్వహిస్తారని, అందులో గీత పాల్గొంటుందన్నారు.