మామిడిపల్లిలో గాలివాన బీభత్సం
కనేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభం
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మామిడిపల్లి గ్రామంలో పెను ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలివానకు గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో భారీగా చెట్లు కొమ్మలు విరిగిపడడంతో ఐదు కరెంట్ పోల్స్ నెలకొరి గాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుపై అడ్డంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకూలడంతో అటుగా వెళ్తున్న 108 అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీని వేరొక అంబులెన్స్‌కు తరలించారు. గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది, గాలివానతోపాటుగా పిడుగులు కూడా పడ్డాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన హరి శ్రీనివాసరావు అనే పాడి రైతు ఆవు చనిపోయింది. పెద్దగా వీచిన ఈదురుగాలులకు పలు మామిడి తోటల్లో కాయలు, పింజలు నేలరాలాయి. అరటి తోటలు గాలికి పడిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈసందర్భంగా వారు కోరుతున్నారు.