శివరాంపురంలో పొలం పిలుస్తుంది సదస్సు
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో పొలం పిలుస్తుంది అవగాహన సదస్సును సాలూరు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళ వారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఆర్సీ నుంచి ఏడీఏ భారతి హాజరై శివరాంపురం గ్రామంలో పంటలను పరిశీలించారు. గ్రామంలో పంటల సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. వరి పంట లో కాండం తొలిచే పురుగు, ఆకు ముడత అక్కడక్కడ ఉన్నట్లు గుర్తించారు. వారి నివారణ కోసం మోనోక్రోటో ఫాస్ను స్ప్రే చేసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి పి.అనూరాధ పండా మాట్లాడుతూ గ్రామంలో ఆవులు ఎక్కువుగా ఉన్నందున రైతులందరూ సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుందన్నారు. దీనితో నాణ్యమైన దిగుబడితోపాటు, ఆరోగ్యకరమైన పంటలు పండి, భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఏపీసీ ఎన్ఎఫ్ సిబ్బంది కషాయాల తయారీ విధానం గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ మోహన్, వీవీఏ వెంకటేష్, ఏపీసీఏన్ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.