ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలి
కజడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): సీజనల్ వ్యాధులను అరికట్టి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తక్షణమే అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగాయి. 1, 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పి చైైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన, 3వ స్థాయి సంఘ సమావేశం వైస్ ఛైర్మన్ బాపూజీనాయుడు అధ్యక్షతన, 5వ స్థాయి సంఘ సమావేశం ఆ సంఘ ఛైర్పర్సన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లోని వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల విజృంభణకు కారణాలను కనుగొని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు విజృంభించకముందే, వాటిని అరికట్టేందుకు ముందుగానే చర్యలను తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం బాగులేదన్నారు. మంకీ ఫాక్స్ వ్యాధి కూడా కనిపించిందని చెప్పారు. గ్రామాల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని అరికట్టాలని సూచించారు.
వైస్ చైర్మన్ బాపూజీనాయుడు అధ్యక్షతన జరిగిన 3వ స్థాయి సంఘ సమావేశంలో వ్యవసాయ పరిసితిపై చర్చించారు. విజయనగరం జిల్లాలో బొండపల్లి, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యిందని, ఉబాలు పూర్తి కాలేదని తెలిపారు. ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి కోరారు. డీఆర్డీఏ, పౌర సరఫరాలశాఖపై చర్చించారు.
ఛైర్పర్సన్ శాంతకుమారి అధ్యక్షతన మహిళా శిశుసంక్షేమంపై చర్చ జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, డిప్యుటీ సీఈవో రాజ్‌కుమార్, రెండు జిల్లాల జడ్పీటీసీ సభ్యులు, కమిటీ మెంబర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.