వలంటీర్ల వ్యవస్థ లేదు.. వారికి జీతాలు ఇవ్వలేం
కమంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం
కమీరు రెన్యూవల్ జీవో ఇవ్వొచ్చుగా అన్న బొత్స సత్యనారాయణ కమండలిలో రచ్చ
అక్షర కిరణం, (అమరావతి): వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు వలంటీర్ల కొనసాగింపుపైన స్పష్టత ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశా ల్లో చర్చకు వచ్చినా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయం లో వలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వలంటీర్ల కొనసాగింపు పైన శాసనమండలి వేదికగా స్పష్టత ఇచ్చారు.
ఏపీ శాసనమండలిలో వలంటీర్ల వేతనాల అంశంపైన చర్చ వచ్చింది. స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసలు ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థ అమల్లో లేదన్నా రు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 ఆగస్టు తరువాత వలంటీర్లు రెన్యువల్ కాలేదని.. ఈమేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేసారు. అమల్లోనే లేని వలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామ ని ప్రశ్నించారు. అమల్లోనే లేని వలంటీర్లు ఎలా రాజీనామా లు చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. వలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకోని వైసీపీ ప్రభుత్వం వలంటీర్లను.. ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు.
దీనికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్సా స్పందించారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీసారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లను కొనసాగించి వారికి రూ 10 వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.
‘’ఎన్నికల్లో మీరు వలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వలంటీర్ల వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు.