గుర్లలో వైరల్ జ్వరాలు లేవు
కతహసీల్దార్ ఆదిలక్ష్మి
ప్రజలు అందోళన చెందవద్దు
అక్షర కిరణం, (గుర్ల/విజయనగరం): మండలం లోని గుర్ల గ్రామంలో ఎటువంటి వైరల్ జ్వరాలు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి తెలిపారు. గుర్లలో 50 మందికి చికున్ గున్యా జ్వరాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ఎటువంటి వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు గుర్లలో లేరని వైద్య సిబ్బంది నుంచి వచ్చిన రిపోర్ట్ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని సూచించారు. వేడి వేడి ఆహార పదార్దాలు తినాలన్నారు. ముఖ్యంగా వ్యక్తి గత పరిశుభ్రత పాటించి వ్యాధులు బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కాగా జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున, జిల్లా వైద్యాధికారి జీవనరాణి, జిల్లా మలేరియా అధికారి మణి, ఎంపీడీఓ రవికుమార్, ఈఓపీఆర్డీ అన్నపూర్ణ దేవి, డాక్టర్ సత్యన్నారాయణ గ్రామంలో పర్యవేక్షించారు. గ్రామ వీధుల్లో పర్యటించి పారిశుధ్యం పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలోని కొన్ని ఇళ్లకు వెళ్లి పరిశీలించి జ్వర పీడుతు లెవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ముందుగా గ్రామంలో పీహెచ్సీ వైద్యాధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విషజ్వరాలు రాకుండా ముందస్తు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యాధికారి డాక్టర్ వెంకటమధు, నేచురోపతి వైద్యాధి కారిణి డాక్టర్ రజితారోయ్ తదితరులు పాల్గొన్నారు.