ఆధార్ కార్డును అంగీకరించవలసిందే
కఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓటర్ల జాబితా సవరణ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికలకు ముందు సుమారు 65 లక్షల మంది ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారాయి. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. తాజాగా అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓట్ల తొలగింపుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చేందుకు.. అవసరమైన ధృవపత్రాల జాబితాలో ఆధార్ కార్డు ను కూడా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ కోసం సమర్పించాల్సిన 11 ధృవపత్రాల్లో ఆధార్ కార్డు కూడా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ఈసీకి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ ఓట్లను జాబితా నుంచి తొలగించారని.. లక్షలాది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల జాబితాకు సంబంధించి.. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కొనసాగుతోంది. ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. జాబితా నుంచి పేర్లు తొలగించిన వారు.. నివాస ధృవీకరణ కోసం ఆధార్ కార్డును కూడా సమర్పించవచ్చని సూచించింది. వారు సమర్పించిన ఆధార్ కార్డులను ఎన్నికల సంఘం తప్పకుండా ఆమోదించాలని తేల్చి చెప్పింది.
రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
బిహార్లో ఓటర్ల జాబితాలో లక్షల మంది ఓట్లు తొలగించారంటూ దేశంలోని చాలా రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఓట్ల తొలగింపులపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నప్పటికీ.. తొలగించబడిన ఓటర్లకు సహాయం చేయడంలో మాత్రం రాజకీయ పార్టీలు సరైన రీతిలో పని చేయడం లేదని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు తమ పనిని తాము సరిగా నిర్వహించడం లేదని మండిపడిరది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించబడిన వారికి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా సహాయం చేయా లని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తమ ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని పార్టీలు ఆరోపిస్తున్నప్పటికీ.. తమ ఏజెంట్ల ద్వారా అభ్యంతరాలను సమర్పించడం లేదని.. కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ముందుకు వచ్చిన ట్లు కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని భావిస్తున్నారు. అర్హులైన వారు.. తమ పేర్లను మళ్లీ ఓట్ల కోసం నమోదు చేసుకునే అవకాశం లభిస్తుం దని చెబుతున్నారు.