ఏపీలో పలు రైళ్లు రద్దు: మరికొన్ని దారి మళ్లింపు
అక్షర కిరణం, (అమరావతి/విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. కృష్ణా కెనాల్ నుండి గూడూరు వరకు మూడో లైన్ నిర్మాణం చేస్తున్నారు.. ఈ మూడో లైన్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలిపారు. గూడూరు నుంచి బాపట్ల జిల్లాలోని చుండూరు వరకు మొదటి దశ పనులు పూర్తయ్యాయి.. ప్రస్తుతం పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి మీదుగా చుండూరుకు మూడో లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో తెనాలి మీదుగా నడిచే రైళ్లను రద్దు చేశారు.. పలు రైళ్లను మళ్లించారు.
ఈ నెల 8 నుంచి 19వ తేదీ వరకు విజయవాడ నుంచి తెనాలి మీదుగా ఒంగోలు, గూడూరు వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి 24వ తేది వరకు గుంటూరు నుంచి తెనాలి మీదుగా రేపల్లె వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు. ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రేపల్లె - సికింద్రాబాద్ మధ్య నడిచే డెల్టా ఎక్స్ప్రెస్ రైళ్లు గుంటూరు వరకు మాత్రమే వెళతాయి (తెనాలి, రేపల్లె రావు). ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి లింగంపల్లి నడుమ తెనాలి మీదుగా నడిచే రెండు రైళ్లు నేరుగా గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తాయి (తెనాలి రావు). ఈ మార్పులను గమనించాలని ప్రయాణికులకు సూచించారు.
తిరుపతి-ఆదిలాబాద్ రైలు (17405/17406) ఆగస్టు 13 నుంచి 20 వరకు రద్దు. తిరుపతి-విశాఖపట్నం రైలు (22707/22708) ఆగస్టు 13 నుంచి18 వరకు రద్దు. తిరుపతి-నర్సాపూర్ (07131/07132) రైలు ఆగస్టు 17, 18 తేదీల్లో రద్దు చేశారు. అంతేకాదు విజయవాడ-గూడూరు (67225/67226) రైలు ఈ నెల 6 నుంచి 24 వరకు రద్దు చేశారు. గూడూరు-సికింద్రాబాద్ (12709/12710) రైలు ఈ నెల 14, 17, 18 తేదీల్లో రద్దు. తిరుపతి-లింగంపల్లి (12733/12744) రైలు ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రద్దైంది. విజయవాడ-గూడూరు (12743/12744) ఆగస్టు 11వ తేదీ నుంచి 20 వరకు రద్దు చేశారు. నర్సాపూర్-ధర్మవరం (17247/17248) రైలు ఆగస్టు 11 నుంచి 19 వరకు రద్దు.. రేణిగుంట-కాకినాడ టౌన్ రైలు (17249/17250) ఆగస్టు 12 నుంచి19 వరకు రద్దు చేశారు. రేణిగుంట-నిజాముద్దీన్ (00761) రైలు ఈ నెల 25, 26, 28 తేదీల్లో వయా కృష్ణాకెనాల్, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా వెళుతుంది. హౌరా-తిరుపతి (20889) రైలు, పూరి-తిరుపతి (22859) రైలు ఈ నెల 26న, సంత్రాగచి-తిరుపతి (22855) రైలు ఈ నెల 27న, తిరుపతి-భువనేశ్వర్ (22872) రైలు ఈ నెల 28న వయా కృష్ణాకెనాల్, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించారు.