దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రీ పెయిడ్ ఆటో-రిక్షా సేవలు ప్రారంభం
అక్షర కిరణం (విశాఖపట్నం): ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్, విశాఖపట్నం సిటీ పోలీస్ సహకారంతో, దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్ ఆటో-రిక్షా సేవలను ప్రారంభించింది. ప్రయాణికులకు సహాయం చేయడానికి ఈ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ప్రీపెయిడ్ సర్వీస్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. ప్రత్యేక కార్యాలయంలో ముందుగానే తమ గమ్యస్థానాలకు ఛార్జీలను డిపాజిట్ చేసి ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈపారదర్శక ప్రక్రియ చెల్లించవలసిన ఖచ్చితమైన మొత్తంపై స్పష్టతను నిర్ధారిస్తుందని తెలిపారు. ఛార్జీల చర్చల ఇబ్బందులను తొలగిస్తుందన్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్ సేవను వాల్టేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రతా బాగ్చీ సిటీ ఆటో-రిక్షా అసోసియేషన్ సభ్యులు, వాల్టేర్ డివిజన్, సిటీ పోలీస్ అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభిం చారు. ప్రస్తుతం ఈ సేవను అందించడానికి 70కి పైగా ఆటో రిక్షాలు నమోదు చేశారు. వాల్టెర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ ఈ వ్యవస్థ ప్రయాణికులకు స్పష్టమైన సౌకర్యవంతమైన ఛార్జీల నిర్మాణాన్ని అందిస్తుంద ని తెలిపారు. పారదర్శకత, నగర పరిధిలో సురక్షితమైన ప్రయాణానికి భరోసా ఇస్తుందని తెలిపారు.
పోలీసు కమిషనర్ శంఖబ్రతా బాగ్చీ మాట్లాడుతూ ‘ప్రీపెయిడ్ సేవలో నిమగ్నమైన అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను అమర్చారని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసుల పర్యవేక్షణలో ప్రయాణీకుల భద్రతను పెంచు తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు, పోలీసు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.