కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): వన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రొటోకాల్ దర్శనములు గురు వారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ఉంటాయని తెలిపారు. మార్గశిరమాసం పంచా మృతాభిషేకం ప్రతి గురువారం రూ.7500 రూసుము చెల్లించి భక్తులు నిర్వహించుకోవాలని కోరారు.
గురువారం మినహా ఇతర వారాల్లో పంచామృతాభిషేకం నిర్వహించే భక్తులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇక ప్రతి శుక్రవారం మార్గశిరమాసం పంచామృతాభిషేకం రూ.1116/- చెల్లించి నిర్వహించుకో వచ్చని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో శోభారాణి తెలియజేశారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.రమణ, ఏఈఓ సూరిబాబు, అసిస్టెంట్ ఇంజినీర్ కే .సూర్యా రావు, సూపరింటెండెంట్లు పద్మజ, తిరుపతిరావు, ప్రధాన అర్చకులు కే.శ్రీనివాసశర్మ, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.