ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అపచారం
పట్టపగలే డ్రోన్ ఎగురవేసిన యూ ట్యూబర్ కేసు నమోదు చేసిన పోలీసులు
అక్షర కిరణం, (ద్వారకా తిరుమల): ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత చిన్న తిరుమలగా పేరు పొందిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఈఆలయంపై డ్రోన్ ఎగిరింది.. ఈ ఘటన కలకలంరేపగా.. ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. ఈ డ్రోన్ వ్యవహారంపై ఆలయ అధికారులు సీరియస్‌గా స్పందించారు. యూట్యూబర్ తీరుతో ఆలయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆలయ ఏఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకా తిరుమల ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉంది.. అయినా సరే పట్టపగలే యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసిన వీడియోను వైరల్ చేశాడు. అంతేకాదు ద్వారకా తిరుమల ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియో రికార్డు అయ్యాయి. అయితే నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే ఆలయ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు