ఉత్తరప్రదేశ్‌లో మరో ఆటవిక సంఘటన
కాన్పూర్ సమీపం జాతీయ రహదారిపై తలలేని మహిళ నగ్న మృతదేహం
యోగి ఆదిత్యనాథ్ హయాంలో మహిళలపై పెరిగిన దాడులు
అక్షర కిరణం, (యూపీ/జాతీయం): ఉత్తర్ ప్రదేశ్‌లో ఆటవిక ప్రవృత్తి రాజ్యం ఏలుతోంది. రోజుకో దారుణ ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా, జాతీయ రహదారిపై నగ్నంగా ఉన్న తలలేని మహిళ మొండం గుర్తించారు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడి ఉండటం ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని గుజైనా వద్ద నగ్న మృతదేహాన్ని గుర్తించారు. అత్యాచారం తర్వాత హత్యచేసి జాతీయ రహదారిపై విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొద్ది గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యింది. ఆ మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి ఉండగా.. మృతదేహానికి సమీపంలో అదే రంగులో ఉన్న వస్త్రం ముక్కలు కనిపించాయి. బుధవారం ఉదయం 6.15 గంటలకు నగ్నంగా ఉన్న తలలేని మహిళ మృతదేహం తొలుత గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. శవం గుర్తించిన ప్రదేశంలో ఎటువంటి సీసీ టీవీ కెమెరాలు లేవు కానీ, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని చెప్పారు. ఆమె ధరించిన దుస్తులు.. మృతదేహం వద్ద ఉన్న వస్త్రం పీలికలు ఒకే రంగులో ఉన్నాయని వివరించారు. క్లూ దొరుకుతుందేమోనని సీసీటీవీని పరిశీలిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా, జిల్లాలో మహిళ మిస్సింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలోనూ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనా లను సేకరించారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరిగిన మరో షాకింగ్ ఘటన ఇది.. తల లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాన్పూర్ జాతీయ రహదారిపై గుర్తించారు.. ఈఅంశంపై విచారణ జరిపించి.. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా కఠిన శిక్ష విధించాలి’ అని డిమాండ్ చేశారు.