టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
కజెండా ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు
అక్షర కిరణం, (మంగళగిరి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి అశోక్ బాబు, వల్లూరు కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎంతోమంది సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలితమని గుర్తుచేశారు. బ్రిటిష్ వారిని తరిమివేసి స్వాతంత్య్రం సాధించుకున్నప్పటికీ, మనం అనుకున్న లక్ష్యాలను చేరుకున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమసమాజం కోసం రాజ్యాంగాన్ని రచించారని, నాయకులకు అధికార దాహం కాకుండా, సమాజం పట్ల, కాలానికి అనుగుణంగా మారే చట్టాల పట్ల అవగాహన ఉండాలని సూచించారు. చట్టాలపై అవగాహన లేనివారు నాయకత్వం చేపడితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్నారు. గతంలో మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరగకపోవడం, ఏకగ్రీవాలు ప్రజా స్వామ్యాన్ని పాతరేయడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీతత్వం, ఓటు వేసే స్వేచ్ఛ చాలా ముఖ్యమన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం త్యాగమూర్తుల కల అని, ఆ కలలను సాకారం చేయడానికి వారి అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు.